తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా స్థాయి అటవీ సంరక్షణ సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూ సమస్యలను కేటగిరీల వారీగా వర్గీకరించి, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను ముందుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే అంశాలను ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూములు, అటవీ అనుమతులు, భూ జాయింట్ సర్వే, ఆర్‌వోఎఫ్‌ఆర్ దరఖాస్తులు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యాటక అభివృద్ధి, వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని అటవీ, రెవెన్యూ సమస్యలను కేటగిరీల వారీగా విభజించి, అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిని ముందుగా పరిష్కరించాలని ఆదేశించారు. నాగుపల్లి, లచ్చగూడెం, పాల్వంచ, ఉప్పుసాక, కరకగూడెం ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను జాయింట్ సర్వే ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన బోర్‌వెల్లు, గ్రావెల్ రోడ్లు, రహదారులు, తాగునీటి పథకాలు, విద్యుత్, వైద్య సేవలు, విద్యా సదుపాయాలకు సంబంధించిన అటవీ అనుమతులను అత్యంత ప్రాధాన్యతతో మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాథమిక అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండకూడదన్నారు.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, గత ఏడాది సగటున 6 మీటర్లలో ఉన్న భూగర్భ జలాల మట్టం ప్రస్తుతం 9 మీటర్లకు పడిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని బోర్‌వెల్లు, మిషన్ భగీరథ, తాగునీటి పథకాల అనుమతులను అత్యవసర ప్రాతిపదికన మంజూరు చేయాలని సూచించారు.ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే గృహాలు ఉండి అదే స్థలంలో పునర్నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు అవసరమైన అటవీ అనుమతులు మంజూరు చేయాలని, కొత్తగా అటవీ భూముల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు.మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేందుకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనుమతులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.పోడు వ్యవసాయానికి సంబంధించి కొత్తగా అడవులను నరికివేసి సాగు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అయితే ఎన్నో సంవత్సరాలుగా పోడు సాగు చేస్తున్న గిరిజన రైతుల సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.సింగరేణి ఓపెన్‌కాస్ట్ విస్తరణకు సంబంధించిన అటవీ అనుమతులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్ పి రోహిత్ రాజు మాట్లాడుతూ అటవీ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. అటవీశాఖ అధికారులు పోడు ప్రాంతాలకు వెళ్లే ముందు పోలీసు శాఖకు సమాచారం అందిస్తే అవసరమైన భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలతో సమన్వయం పెంపొందించుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.వన్యప్రాణుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటకు సంబంధించిన కేసులు నమోదు చేశామని తెలిపారు. వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసు శాఖకు తెలియజేయాలని కోరారు. 2017 నుంచి జిల్లాలో గంజాయి సాగుకు సంబంధించిన కేసులు నమోదు కాలేదని తెలిపారు.జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 4.10 లక్షల ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందని తెలిపారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కొత్తగా అడవులను నరికివేయకుండా చర్యలు తీసుకుంటూనే పోడు వ్యవసాయానికి సంబంధించిన డివిజన్‌వారీ వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫేక్ ఆర్‌వోఎఫ్‌ఆర్ దరఖాస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదని, వన్యప్రాణులు కూడా అటవీ సంపదలో భాగమని అన్నారు . సాంకేతిక పరిజ్ఞానంతో వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఆర్‌వోఎఫ్‌ఆర్‌కు సంబంధించిన 860 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చట్టబద్ధంగా పరిష్కరిస్తామని తెలిపారు. కిన్నెరసాని, భద్రాచలం, పర్ణశాల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అన్ని అటవీ అనుమతులు ఆన్‌లైన్ విధానంలోనే జారీ అవుతున్నాయని, నాలుగు నెలల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అటవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ భద్రాచలంలోని "భద్రగిరి మార్ట్ " తరహాలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని అన్నారు .ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్, మిషన్ భగీరథ తదితర శాఖలకు సంబంధించిన ఫారం-బి అనుమతులు సకాలంలో అందకపోవడంతో సుమారు 20 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పోడు వ్యవసాయానికి సంబంధించి సుమారు 1,800 దరఖాస్తులు అందాయని, దీర్ఘకాలంగా సాగు చేస్తున్న గిరిజన రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గుత్తికోయ హ్యాబిటేషన్లకు విద్యుదీకరణ కల్పించేందుకు అవసరమైన అటవీ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ బూర్గంపాడు ప్రాంతంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న అటవీ–రెవెన్యూ కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతులు, భూ సమస్యలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో వివరించి, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ