తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో కమీషనర్ సుజాతతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వచం, సుజాతనగర్ ప్రాంతాల నుండి పలువురు పలు సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి సారిగా స్థానిక ఎంఎల్ఏ కూనంనేని ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇక నుండి ప్రతీ బుధవారం ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ సమస్యను అధికారులు చిత్తశుద్దితో క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయానికి ఫిర్యాదులతో రాకుండా వారి సమస్యలను వార్డుల వారీగా తెలుసుకుని పరిష్కరించాలన్నారు. అధికారులు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ అధికారులమైన మనం ప్రజా సమస్యల పరిష్కారానికే ఉన్నామని, దీనిని ప్రతీ ఒక్కరూ గమనంలో ఉంచుకోవాలన్నారు. ఒక ప్రణాళికా బద్దంగా ప్రాధాన్యతా క్రమంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ విజయానంద్, మేనేజర్ సత్యనారాయణ, ప్రసాద్, రవీందర్, నవీన్, శ్రీనివాస్, అశోక్ చౌహాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ