తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి పదవీ విరమణ పొందిన ఇద్దరు ఎస్సైలను,ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.37 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్సై మీర్జా కమల్షా బేగ్,37 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం దమ్మపేట పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్సై వంక రామరాఘవయ్య మరియు 36 సంవత్సరాలు తమ సేవలను అందించి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పరిశిక మల్లికార్జున రావు లు మంగళవారం నాడు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ ముగ్గురు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.పదవీ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చూడాలని కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యా నాయక్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ