తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్‌లకు నిర్వహించిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు మరియు సహాయక సిబ్బందికి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేపట్టిన ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఫారమ్–XIV స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల జారీ, ఓటింగ్ నిర్వహణ తదితర అన్ని దశలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా జారీ చేయగా, వాటిలో 22 బ్యాలెట్లు సేవా ఓటర్లకు అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోగా, ఇందులో 13 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 27 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించారు. ఇందులో 12 మంది పురుషులు, 15 మంది మహిళలు పాల్గొన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 110 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 110 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించారు. వీరిలో 63 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ