తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మణుగూరు ప్రకాశ్ ఖని ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో డి.ఏ.వి. పాఠశాల ప్రారంభం రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక... సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం, మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని క్షేత్రస్థాయిలో సందర్శించి గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఇల్లందు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్‌జెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఐఏఎస్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ తదితరులు పాల్గొన్నారు. ముందుగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, నియంత్రణ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఏ.వి. పాఠశాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దిశగా చేపట్టిన చర్యలను అభినందించారు. తదనంతరం మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి గనిలో జరుగుతున్న తవ్వకాల ప్రక్రియ, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1976లో ప్రారంభమైన ఈ గని చరిత్ర, ఇప్పటివరకు జరిగిన బొగ్గు ఉత్పత్తి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు, గని జీవితకాలం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గనిలోకి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి బొగ్గును స్వయంగా చేతిలోకి తీసుకుని దాని నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ అని పేర్కొంటూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వల పెంపు, ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి నిర్వహించే వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొని కొత్త బొగ్గు బ్లాకులను సొంతం చేసుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దేశంలోనే అగ్రగామి బొగ్గు సంస్థగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో సంస్థ వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా, సంస్థ భవిష్యత్ ఉత్పత్తి అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ అవసరాలను తీర్చడంలో, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంలో, వేలాది మంది కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి, విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉద్యోగుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. సింగరేణి భవిష్యత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి, టీఎస్‌జెన్‌కో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ