తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ ఉపశమనం కోసం కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, తాగునీటి అందుబాటు, వడదెబ్బ నివారణ చర్యలు, అలాగే హెచ్‌పీవీ (HPV) టీకాపై అవగాహన అంశాలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులు, బస్ స్టాండ్లు, ప్రజా రద్దీ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వడదెబ్బ బాధితులకు ఉపశమనం కలిగేలా ప్రధాన కూడళ్లలో కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, కూలర్లు, ఫ్యాన్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పనిస్థలాల్లో కార్మికులకు తప్పనిసరిగా నీడ ఏర్పాటుకు షామియానాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం, ఆశా వర్కర్ల, పని ప్రదేశాలలో వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమృద్ధిగా నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు వెంటనే ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో వేసవి జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించి, తాగునీరు ఎక్కువగా తీసుకోవడం, మధ్యాహ్న సమయంలో బయట తిరగకపోవడం వంటి సూచనలు ప్రజలకు చేరవేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. డ్రైనేజీల శుభ్రపరచడం, నిల్వ నీరు తొలగించడం, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు . జూన్ నెలను యాంటీ మలేరియా మాసంగా, జూలై నెలను యాంటీ డెంగ్యూ మాసంగా నిర్వహిస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెచ్‌పీవీ టీకాపై అపోహలు తొలగించి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ టీకా 2006 సంవత్సరం నుంచే వినియోగంలో ఉందని, దీని భద్రత మరియు ప్రభావం అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైందని తెలిపారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఈ టీకా అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ వీటి రవీంద్రనాథ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ