తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు PKOC డిప్ సైడ్ బ్లాక్ వేలం సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కే దక్కేలా, అలాగే ఆ బ్లాక్ జెన్కోకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా నిలువరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ రోజు సింగరేణి భవన్‌లో అన్ని ముఖ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC,TBGKS, CITU, TNTUC సమన్వయంతో కార్యాచరణ సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో PKOC డిప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాల్సిన అత్యవసర అవసరం, దాని ద్వారా ప్రాంతీయ ఉపాధి, సంస్థ భవిష్యత్ స్థిరత్వం, కార్మికుల భద్రతకు కలిగే లాభాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈ బ్లాక్ జెన్కోకు వెళ్లకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన సంయుక్త కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అదేవిధంగా కోయగూడెం–3 మరియు సత్తుపల్లి–3 బ్లాకులు కూడా సింగరేణి సంస్థకే దక్కేలా ఎలా కార్యాచరణ చేపట్టాలనే అంశంపై చర్చించి, ఈ విషయమై ఇంధన శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్కని కలవాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వివరించారు. త్వరలోనే అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో మరో సమన్వయ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, AITUC జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్,INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి,TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి,CITU జనరల్ సెక్రటరీ మంద నరసింహ రావ్,TNTUC అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ,TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, TNTUC వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొన్నారు.అనంతరం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లుని కలసి, ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు.సింగరేణి సంస్థ స్థిరత్వం, కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ