తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి మెరుగైన సేవల కోసం ప్రతి శాఖ సమర్థవంతంగా పనిచేయాలి గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే 99 రోజుల కార్యాచరణ లక్ష్యం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యక్రమాలు కీలకం జూన్ 12న ముగింపు ఉత్సవాలను పండుగలా నిర్వహించాలి : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే గొప్ప కార్యక్రమమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో జిల్లా స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ ప్రభుత్వం అయినా తమ విధానాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేస్తేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీనివల్ల వివిధ శాఖల, ప్రజా ప్రతినిధుల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందన్నారు. జూన్ 12న నిర్వహించనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ముగింపు ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. తొలుత వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన, సంక్షేమ, అభివృద్ధి ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, సిపిఐ పక్ష కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ