తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డి ఆర్ ఓ పద్మావతి తో కలసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు:చుంచుపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన లక్ష్మీబాయి తాను బీఎస్సీ (B.Sc.) వరకు విద్యాభ్యాసం పూర్తి చేశానని, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నందున ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన ప్రమీల తన భర్తతో కలిసి శారీరక దివ్యాంగులమని, సొంత ఇల్లు లేకపోవడంతో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం పీడీ, హౌసింగ్ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.చుంచుపల్లి మండలానికి చెందిన మాలోతు బద్రు తనకు సర్వే నంబర్ 118/1లో 2 ఎకరాల 20 గుంటల సాగుభూమి ఉన్నప్పటికీ, పట్టాదారు పాసుపుస్తకం 20 గుంటలకు మాత్రమే జారీ అయిందని, మిగిలిన 2 ఎకరాల భూమికి కూడా పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం చుంచుపల్లి తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన షేక్ గాలిబ్ సాహెబ్ తాను ఎం.ఏ. (తెలుగు), బి.ఎడ్. వరకు చదివానని, 75 శాతం అంగవైకల్యం కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏదైనా ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు.మణుగూరు మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన కంపేర్ల పాపయ్యకు మణుగూరు మండలం రామానుజవరం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 104లో 2 ఎకరాల 22 గుంటల భూమి ఉందని, సింగరేణి ఓసీ విస్తరణలో భాగంగా 1 ఎకరం 38 గుంటలకు మాత్రమే సర్వే నిర్వహించారని, మిగిలిన భూమిని సర్వే చేయకపోవడంతో జీవనాధారం కోల్పోతున్నానని పేర్కొంటూ మిగిలిన భూమిని కూడా సర్వే చేయాలని కోరారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ-ఎల్‌ఏ)కు ఎండార్స్ చేశారు.కొత్తగూడెం పట్టణంలోని గణేష్ బస్తీ వాసులు తమ ప్రాంతంలో కోతుల బెడద అధికంగా ఉందని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ