తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) ఈ రోజు మణుగూరు ఏరియా ఆసుపత్రిని సందర్శించి, మణుగూరు MJPTC BC హాస్టల్‌లో జరిగిన ఆహార విషబాధ (Food Poisoning) ఘటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది. వారిలో 16 మంది విద్యార్థులను మణుగూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఒక విద్యార్థికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి హాస్టల్‌కు పంపించారు. మిగతా విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్థిరంగా ఉన్నారు. వారిని ఏరియా ఆసుపత్రి బాల వైద్య నిపుణుడు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.సందర్శన సందర్భంగా DM&HO విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు తీసుకున్న ఆహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వారికి ఎదురైన లక్షణాల గురించి ఆరా తీశారు. ఎక్కువగా విద్యార్థులు వాంతులు మరియు కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.తదుపరి DM&HO మణుగూరు లోని MJPTC BC హాస్టల్‌ను సందర్శించి, అక్కడ RBSK బృందాలు మరియు PHC మణుగూరు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా హాస్టల్ స్టాఫ్ నర్స్‌కు విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే సమీపంలోని వైద్య అధికారులకు సమాచారం అందించాలని, అవసరమైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స (First Aid) అందించేలా చర్యలు తీసుకోవాలని DM&HO సూచించారు.ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ