తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి అని టీజీ రెడ్‌కో ఛైర్మన్ ఎ. శరత్ అన్నారు.ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం, తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి శక్తి అభివృద్ధి సంస్థ (TGREDCO) ఛైర్మన్ ఎ. శరత్, ఐఏఎస్ (రిటైర్డ్) ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన మరియు సౌర శక్తి వినియోగంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగ విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపులు మొదలైన చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.ఛైర్మన్ ఎ. శరత్ మాట్లాడుతూ, పీఎం కుసుమ్ పథకం కింద అమలవుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. సౌర శక్తి వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు మెరుగుపడతాయని, రైతులు శాశ్వతంగా లబ్ధి పొందుతారని తెలిపారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద బోర్లు వేయడానికి తగిన ప్రదేశాలను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించాలని ఆదేశించారు. భూగర్భ జలాల లభ్యత, భూసర్వే నివేదికలు, రైతుల సాగు అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతిక నిపుణుల సూచనలతో బోర్లు వేయాలని ఆయన సూచించారు.జిల్లాలో మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి మరియు మణుగూరు మండలం ఉడతనేని గుంపులో స్థలాలు కేటాయించబడ్డాయని, వీటి స్థాపనకు అవసరమైన చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా మోడల్ సోలార్ గ్రామాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో 80 గ్రామాలను గుర్తించారని, అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగుల పల్లి గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రామంలో అన్ని ఇళ్లకు సోలార్ సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.అదేవిధంగా, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఎ. శరత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా ప్రభుత్వ భవనాల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాక, అవి పర్యావరణానికి అనుకూల నమూనాలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఛైర్మన్ ఎ. శరత్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యుత్ శాఖ అధికారి మహేందర్, టి జి ఆర్ జి డి సి ఓ జిల్లా మేనేజర్ రాజేందర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ