తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం సుజాతనగర్ మండలంలో పర్యటించి ప్రభుత్వ పాఠశాల పనితీరుతో పాటు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సుజాతనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్, విద్యార్థుల హాజరు, బోధన తీరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, నాణ్యమైన, పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకుని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో మాట్లాడారు. గ్రామంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు, విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోల సంఖ్య, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులు స్పందిస్తూ గ్రామంలో ఇప్పటివరకు 1,400 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు వివరించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీతో పాటు ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ నిర్ణీత గడువులోగా ఫారాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిని బీఎల్‌వోలు తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు . అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం చూపాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఈ కీలక కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అధికారులు, బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించి ఓటర్ల జాబితా సవరణను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ