తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివిధ కారణాల వల్ల సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమంపై వివిధ బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృతస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘మీ డబ్బు – మీ హక్కు’ నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ప్రజలకు చెందవలసిన కానీ ఇప్పటివరకు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా పాలసీల రాబడులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద నిలిచిపోయిన మొత్తాలను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ‘ఉద్గమ్’ (UDGAM) వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని, సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో సుమారు రూ.46 కోట్ల మేర అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ మొత్తాలు తిరిగి ప్రజలకు చేరితే వారి ఆర్థిక భద్రతకు, కుటుంబాల సంక్షేమానికి ఎంతో దోహదపడతాయని అన్నారు.ప్రజల్లో అవగాహన మరింత పెంచేందుకు ఏపీఎం పరిధిలోని సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు గ్రామ స్థాయిలో ఇంటింటి ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా అవసరమైన సహాయం అందించాలని సూచించారు.అలాగే ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అన్ని అన్‌క్లెయిమ్ డిపాజిట్లను డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే సంబంధిత శాఖాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న అన్‌క్లెయిమ్ డిపాజిట్ల పూర్తి వివరాలను సమగ్ర నివేదికల రూపంలో జిల్లా పరిపాలనకు సమర్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్ డిపాజిట్లను విజయవంతంగా క్లెయిమ్ చేసుకున్న కుంజ భద్రమ్మ, కందుల మనమ్మ, గొప్పన బాలమ్మ, మిట్టపల్లి అహల్య, తోట అపర్ణ, సిహెచ్. పాండురంగారావు తదితర లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అదేవిధంగా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖలు, బ్యాంకులకు సంబంధించిన అన్‌క్లెయిమ్ డిపాజిట్ల ఫారములు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, అక్కడే దరఖాస్తుల పరిశీలన, మార్గదర్శనం అందించారు. ప్రజలకు అవసరమైన పత్రాలు, ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ