తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లో ఇప్పటికే ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఆప్ గ్రేడ్ చేసి , యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగూడెంలో అనేక పారిశ్రామిక సంస్థలు ఉన్నాయని, సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉందని, అంతేకాకుండా టీఎస్ జెన్కో, నవ భారత్ వెంచర్స్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్, ఎన్ ఎం డీసీ లాంటివి ఉన్నాయని తెలియజేస్తూ, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఇంతకుముందు స్కూల్ ఆఫ్ మైన్స్) ని ఆప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులందరికీ కొత్తగూడెంయూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల చెప్పారు.అన్ని వనరులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గా అప్ గ్రేడ్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయన్నారు. అదేవిధంగా అప్ గ్రేడ్ చేసిన యూనివర్సిటీలో యూ.జి, మాస్టర్స్, పి.హెచ్.డి ప్రోగ్రాంలలో భూగర్భశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రాంలు అదనంగా చేర్చి, భూగర్భశాస్త్ర, ఖనిజశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో కెమిస్ట్రీ, మరియు జియో ఫిజిక్స్ లలో ప్రత్యేక విద్య మరియు శిక్షణని అందించాలని కోరారు. ఈ విధంగా చేసినట్లయితే ఈ విషయాలలో భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తు, మంత్రి తుమ్మల కోరిన విధంగా త్వరలోనే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా మారుస్తూ, దానికి సంబంధించిన అదనపు డిపార్ట్ మెంట్లను కూడా చేర్చడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ