తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని, సిట్టింగ్ సామర్థ్యాన్ని, భోజన ఏర్పాట్లకు కేటాయించిన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం సభా ప్రాంగణంలో సరిపడా సిట్టింగ్‌ను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే విధంగా సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలతో అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగా పరిశీలించి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన శిక్షణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, కార్యక్రమం నిర్వహణ కోసం ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు తెలిపారు.శిక్షణ శిబిరం వద్ద అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌తో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమర్థ వినియోగం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణ అమలు విధానం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య,డీపీఓ సుధీర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ