తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ/వార్డు సభలను విజయవంతం గా నిర్వహించాలి. ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా పర్యావరణ వారోత్సవాలపై సమీక్ష – గ్రామ/వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాదు నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అదే విధంగా పర్యావరణ వారోత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా, లక్ష్యబద్ధంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ/వార్డు సభలను నిర్దేశిత తేదీలైన ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో తప్పనిసరిగా నిర్వహించాలని, దానికి అవసరమైన ఏర్పాట్లు విస్తృత స్థాయిలో చేయాలని ఆదేశించారు. ఈ సభల ద్వారా ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పంటల మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని అన్నారు . వర్షాకాల సన్నద్ధతలో భాగంగా కాలువల శుభ్రత, నీటి నిల్వల నిర్వహణ, వరద నియంత్రణ చర్యలు ముందస్తుగా చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణ, గ్రామీణ పారిశుధ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి హరిత కవచాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. నిర్ణయించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. గ్రామ/వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ సభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు .పంటల మార్పిడి, వర్షాకాల సన్నద్ధత చర్యలు, పరిశుభ్రత కార్యక్రమాలు, చెట్ల పెంపకం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లాలో అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా అమలు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సిపిఓ సంజీవరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ