తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరుసగా మూడు రోజుల సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి గడువును పెంచాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పదో వార్డులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14 వరకే గడువు ఉండడంతో గత మూడు రోజుల నుండి ఆన్లైన్ సెంటర్లో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన నిరుద్యోగులకు మీసేవ కేంద్రాల్లో వెబ్ సైట్ అంతరాయం ఉండటంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తక్షణమే సెలవు దినాలను దృష్టిలో పెట్టుకొని యువ వికాసం గడువును పెంచాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఆన్లైన్ చేసే సందర్భంలో జరిగిన తప్పులను అలాగే ఒక యూనిట్ బదులు మరొక యూనిట్ ఆన్లైన్లో పొరపాటున ప్రింట్ అయిన దరఖాస్తును సరిచేసుకునేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించిన తర్వాత నష్టపోయిన శెట్టిబలిజ కులం వారికి రాజీవ్ యువ వికాసంలో అలాగే ఇతర పథకాల్లో వారికి నష్టం జరిగినదని అన్నారు. తక్షణమే వారిని దృష్టిలో పెట్టుకొని కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు కలిగిన శెట్టిబలిజ కులం వారికి రాజీవ్ యువ వికాసంలో అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు తమ్మ సత్యనారాయణ, కాటంరాజు, యూత్ నాయకులు రామ్ రాకేష్ ,రమేష్, సుభాన్, భూపతి, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ