తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజల నుండి అందిన వినతులు, ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, జిల్లా గృహనిర్మాణ సంస్థ (హౌసింగ్) ప్రాజెక్టు డైరెక్టర్‌తో కలిసి స్వీకరించి పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే వినతులను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించి దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు:కొత్తగూడెంకు చెందిన గుగులోతు కృష్ణకుమారి తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని విన్నవించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తదుపరి చర్యల కోసం కొత్తగూడెం ఆర్డీవోకు ఎండార్స్ చేశారు.సారపాక గాంధీనగర్ గ్రామపంచాయతీకి చెందిన తన్నీరు నాగదేవి ధరణి సర్వే సమయంలో తన ఇంటి పన్ను అంచనా విలువ పొరపాటున సున్నా గా నమోదైందని, దీంతో ఇంటి పన్ను విధించడం లేదని తెలిపారు. ఇంటి పన్ను రసీదు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు తదితర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి పన్ను అంచనాను సరిచేసి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.ఇల్లందు మండలం రొంపేడు గ్రామపంచాయతీకి చెందిన భాగ్యలక్ష్మి తాను ఎం.ఏ., బి.ఎడ్. పూర్తి చేసినప్పటికీ ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తగిన ఉపాధి కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించి తదుపరి చర్యల కోసం జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందిన రవీందర్ సర్వే నంబర్ 228/2లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని, ఈ వినతిని పరిశీలించిన అదనపు కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ