తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి. ఎన్నికల అధికారులకు, బిఎల్ఏలకు ప్రజలు సహకరించాలి. ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు బాధ్యతను గుర్తించాలి. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అధికారులకు ఎన్యుమరేషన్ ఫారం అందించిన ఎమ్మెల్యే.రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని తన నివాసం చుంచుపల్లి మండలం విద్యానగర్లో గురువారం ఆయన తన ఎన్యుమరేషన్ పత్రాన్ని స్వయంగా నింపి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ విజయవంతం కావడానికి ఎన్నికల అధికారులకు, బిఎల్ఏలకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. అలాగే రాజకీయ పక్షాలు, ఆయా పార్టీల తరపున నియమితులైన బిఎల్ఏలు కూడా ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి పౌరునికి ఓటు హక్కు అనేది అత్యంత విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు జాబితాలో తప్పులుంటే సవరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జనార్దన్, ఆర్ఐ జి నరసింహారావు, విఆర్వోలు బాలాజీ, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ