తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లాను విశేషంగా అభివృద్ధి చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల మహా నాయకుడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని, ఆయనతో జర్నలిస్టుల అనుబంధం మరువలేనిదని సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ స్పష్టం చేశారు. 1984 నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేసిన జర్నలిస్టులందరికీ తుమ్మల నాగేశ్వరరావు సుపరిచితులని, ఆయనకు జర్నలిస్టుల పట్ల ఎంతో గౌరవభావం ఉండేదని తెలిపారు.1985 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు సత్తుపల్లి వచ్చి ప్రజాసేవ చేయాలనే సంకల్పం గల విద్యావంతుడైన యువకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశానని, ప్రజలు తప్పనిసరిగా గెలిపించాలని కోరుతూ తుమ్మల నాగేశ్వరరావును నియోజవర్గ ప్రజలకు పరిచయం చేశారన్నారు.ఆ సన్నివేశం ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. అప్పటి నుంచి ఆయన తనకు బాగా తెలుసునని ఆ మధుర జ్ఞాపకాలను రామకృష్ణ నెమరువేసుకున్నారు. ప్రజాసేవయే పరమావధిగా రాజకీయాలలో ప్రవేశించి, ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రజల సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి పథకాలను,కార్యక్రమాలను చేపట్టిన తుమ్మల అభినందనీయుడని ప్రశంసించారు.1986 నుంచి నేటి వరకు నాలుగు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేశారని ఆయన కొనియాడారు. నిజాయితీకి ప్రతిరూపంగా తుమ్మల ప్రజలలో పేరు పొందారని, అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతో నాలుగు దశాబ్దాల పాటు ప్రజలకు విశేష సేవలు అందించారని, ఎన్నో విజయాలను సాధించిన ఆయన రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతంలో గల గుండాల మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత తుమ్మలకే దక్కుతుందని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం లలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సందర్భంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలకు, సమావేశాలకు తాను హాజరయ్యానని, ఆ రోజులు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. జర్నలిస్టుగా తనకు ఆయనంటే ఎంతో గౌరవం అని, మానవత్వం తొణికిసలాడే హృదయం ఉన్న సహృదయుడు తుమ్మల అని కొనియాడారు. కాలగమనంలో నాలుగు దశాబ్దాలు గడిచిపోయినా అప్పట్లో ఖమ్మంలో నాగేశ్వరరావు చెరగని ముద్ర వేశారని అది నేటికీ స్ఫూర్తినిస్తోందని తెలియజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిష్కళంక ప్రజానాయకుడైన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజలకు విశేషంగా సేవ చేయుటకు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యములను ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ