తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి జులై 9( తెలుగు వెలుగు).సింగరేణి భవన్, జులై 9, 2025 . రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసై మెయిన్స్ కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ కు గతంలో ఇచ్చిన గడువు తేదీ ఈనెల 7వ తేదీతో ముగిసిపోయింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 12వ తేదీలోగా దరఖాస్తులు అన్లైన్ లో సమర్పించాలని కోరారు. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన సింగరేణి ఉద్యోగుల పిల్లలకూ రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. ఇదీ నేపథ్యం...గతేడాది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు. గతేడాది 140 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరికి ఒక్కొక్కరికి సింగరేణి సంస్థ లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందజేసింది. వీరిలో 20 మంది మెయిన్స్ లోనూ పాసై ఇంటర్వ్యూకి ఎంపిక కాగా వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ఇదే విధంగా ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ