తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు ఉద్యమం ఆగదు ఇండ్లు కూల్చివేత చర్యలను పేదలపక్షాన ప్రతిఘటిస్తాం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో స్థలాలు క్రమబద్ధీకరించి హక్కు కల్పించాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇండ్లు, ఇండ్లస్థలాలకోసం వామపక్షాలు చేపట్టిన కలెక్టరేట్ ధర్నా సక్సెస్..భారీగా తరలివచ్చిన జనం 'ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు' అనే నినాదంతో లాల్ జెండా పార్టీలు ప్రారంభించిన పోరుబాట, లక్ష్యం నెరవేరేవరకు ఆగబోదని, పేదలకు గూడు కల్పించేవరకు పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ, సిపిఎం, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, ఇండ్లు లేని వేలాది మంది పేదలు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చి నాలుగుగంటలపాటు ఉదృతంగా ధర్నా కొనసాగించారు. ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని ప్రజనుద్దేశించి మాట్లాడారు. నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు వామపక్షాల ఆధ్వర్యంలో సాగే ఈ ప్రజా ఉద్యమం ఎంతమాత్రం ఆగదని స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో నెంబర్ 76ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేసి, అర్హులైన నిరుపేదలందరికీ పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాల్వంచ పరిధిలోని జీవో నెంబర్లు 444, 999, 817, 727, 410 పరిధిలో దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న స్థలాలను తక్షణమే రెగ్యులరైజ్ చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబు మాట్లాడుతూ పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేత చర్యలను తక్షణమే మానుకోవాలని, ప్రభుత్వ నిరంకుశ కూల్చివేతలను పేద ప్రజలందరూ ఐక్యంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఇండ్ల స్థలాలను తక్షణమే క్రమబద్ధీకరించి వారికి చట్టబద్ధమైన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలు నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు జారీ చేయాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులూ గౌని నాగేశ్వరరావు, మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్లను, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, వామపక్ష పార్టీల జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, ఎస్ డి సలీం, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, మున్నా లక్ష్మీకుమారి, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, రాహుల్, ఫహీమ్, ఎం జ్యోతి, లిక్కి బాలరాజు, బ్రహ్మచారి, రేపాకులా శ్రీనివాస్, తుపాకుల నాగేశ్వరరావు, ఎం సతీష్, కుంజా కృష్ణ, పెద్దబోయిన సతీష్, ప్రభాకర్, భాస్కర్, వీరభద్రం, శివ, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ