తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో రేపు, అనగా తేది 03-01-2026 (పూర్ణిమ, శనివారం) నాడు సాయంత్రం 5:30 గంటల నుండి భద్రాచల క్షేత్రంలో గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించబడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలిపారు.మన దేశంలో నదులు ప్రజల జీవనానికి ఆధారంగా నిలిచి, నాగరికత అభివృద్ధికి మూలాధారంగా పనిచేశాయి. తరతరాలుగా నదులు ప్రజల జీవన విధానం, సంస్కృతి మరియు పర్యావరణంతో ముడిపడి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటువంటి నదుల్లో దక్షిణ భారతదేశంలో ప్రవహించే ప్రధాన నది గోదావరి.చరిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా విశిష్టత కలిగిన గోదావరి నది తీరప్రాంతాలు అనేక సంప్రదాయాలు, కథనాలకు కేంద్రంగా నిలిచాయి. భద్రాచలం ప్రాంతం కూడా గోదావరి నదితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉండి, కాలక్రమేణా ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన “ఏరు – ది రివర్ ఫెస్టివల్” లో భాగంగా గత శనివారం నుండి గోదావరి నదికి నది హారతి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నది హారతి కార్యక్రమాన్ని ఇకనుండి ప్రతి వారం భద్రాచలంలో నిర్వహించనున్నట్లు పౌరుల అభిప్రాయం మేరకు 03.01.2026 రోజున మరియు వచ్చే ప్రతి శనివారం నిర్వహించాలని పేర్కొన్నారు.భద్రాచలం ప్రాంతంలో ప్రవహించే గోదావరి నది ఔన్నత్యాన్ని ప్రజలకు మరింతగా తెలియజేయడంతో పాటు, నది ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, గోదావరి నది సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ