తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాతా-శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణ, ఓపీ విభాగం, ప్రసూతి వార్డులు, లేబర్ రూమ్, శిశు వార్డు, ఔషధ నిల్వ గది, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితి, వారికి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, పోషకాహార సదుపాయాలు, ప్రసవాల సంఖ్య తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లు, రోగుల నమోదు వివరాలు, ప్రసవాల రికార్డులు, మందుల నిల్వలు, విధి నిర్వహణ రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదును క్షుణ్ణంగా తనిఖీ చేసి, విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి పేరు, బాధ్యతల గురించి తెలుసుకున్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా పలకరించి, అవసరమైన వైద్య సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణం రోగుల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ఆసుపత్రి పరిశుభ్రతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, నర్సులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ పరిశీలనలో మాత శిశు ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ