తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారుల – ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రజా పాలన విజయవంతం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందాలి : పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి : ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించగా, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. కార్యక్రమం ప్రారంభ దశలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ వారోత్సవాలు, ఆరోగ్య శిబిరాలు విస్తృత స్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా నిరంతర పర్యవేక్షణతో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అయితే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయని అన్నారు . దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 65 డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన జిల్లా అభివృద్ధిలో అన్ని శాఖల భాగస్వామ్యం అవసరమని, శాఖల సమన్వయంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ