తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయడంతో పాటు పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పర్యావరణ హిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక జూట్ బ్యాగులను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రసంగించిన వంగ వెంకట్ మాట్లాడుతూ, ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన బాధ్యతలలో ఒకటని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, నీటి వనరుల క్షీణత వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, నీటి వనరులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత కార్యక్రమాలు, విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం, కాలుష్య నియంత్రణ చర్యలు మరియు పర్యావరణహిత కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ