తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) పరీక్షా కేంద్రం, తెలంగాణ సామాజిక సంక్షేమ నివాస పాఠశాల (TGSWRS) బాలుర విభాగంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు.పరీక్షలు నిబంధనల మేరకు, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా అనే అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల హాజరు నమోదు విధానం, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ, ప్రశ్నపత్రాల రవాణా మరియు భద్రపరచడం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాయేందుకు తగిన డెస్కులు, సరైన లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ గణితశాస్త్రం పేపర్–IA, వృక్షశాస్త్రం పేపర్–I మరియు రాజకీయ శాస్త్రం పేపర్–I పరీక్షలకు జనరల్ విభాగంలో 8,429 మంది, వృత్తిపర (వొకేషనల్) విభాగంలో 1,860 మంది కలిపి మొత్తం 10,289 మంది అభ్యర్థులకు హాజరు కేటాయించగా, అందులో 9,786 మంది హాజరై, 503 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణ, అప్రమత్తత మరియు పారదర్శకతతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తదుపరి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీ లో సంభధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ