తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 5 నుండి 12, 2026 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం ఐ డి ఓ సి కార్యాలయం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 5వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,399 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, వారి కోసం నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్షల నిర్వహణ కోసం నాలుగు మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నాలుగు మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు .విద్యార్థులు పరీక్షలకు ముందురోజే తమ పరీక్షా కేంద్రాలను తెలుసుకోవాలని , పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణలో విద్యుత్ సరఫరా, రవాణా, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి, వైద్యశాఖ ప్రతినిధి డా. టి. ప్రతాప్, విద్యుత్ శాఖ డీఈ పి.ఎస్.వి.ఎస్. నందయ్య, ఇల్లందు మున్సిపాలిటీ ప్రతినిధి డి. శ్రీనివాస్, ఆర్టీసీ ప్రతినిధి కె. మోహన్‌రావు, డీపీఓ కార్యాలయ ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, పోస్టల్ శాఖ ప్రతినిధి ఎం.డి. అలీం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి ఎం. అశోక్, పోలీసు శాఖ ప్రతినిధి పి.డి. క్రిస్టఫర్, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షలు) ఎస్. మాధవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ