తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయ పరిష్కారానికి కృషి చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించి డిజిటల్ పోలీసింగ్‌కు సంబంధించిన కీలక వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమై ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలుపై సమీక్షించారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, కేసుల సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. నాట్‌గ్రిడ్/గాండీవా వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ సమాచార విశ్లేషణ ద్వారా నేరాల నియంత్రణ, దర్యాప్తులో మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన, బాధితుల డబ్బు రికవరీ, పెండింగ్ కేసుల వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. జిఆర్ఎం, ఎంఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ పోర్టళ్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్-111 అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది నిరంతరం సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అన్ని విభాగాల సిబ్బంది డేటా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, అధికారిక సమాచారాన్ని గోప్యంగా భద్రపరుస్తూ సైబర్ భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటి కోర్ ఎస్సై గణేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ