తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలి. క్షేత్రస్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. డీలర్ల సంక్షేమానికి, హక్కుల సాధనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం.ప్రభుత్వానికి, లబ్ధిదారులకు మధ్య వారధులుగా నిలవాలి. సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ల సమావేశం శుక్రవారం పట్టణంలోని మార్వాడి సత్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్ డీలర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్ల పాత్ర కీలకమైనదని, నిరుపేదలకు సక్రమంగా రేషన్ అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీలర్లు ఎదుర్కొంటున్న ప్రతి న్యాయమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. విధుల్లో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన డీలర్లకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు మాచర్ల శ్రీనివాస్, ధన్ రాజ్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దొమ్మేటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ