తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, పంటల దిగుబడిని పెంచడం లక్ష్యంగా " విత్తన మేళా–2026 " కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని, వ్యవసాయ శాఖ సూచించిన పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేపట్టడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల ప్యాకెట్‌పై బ్యాచ్ నంబర్, గడువు తేదీ, మొలక శాతం తదితర వివరాలను పరిశీలించాలని సూచించారు.రైతులు తమ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి స్థానిక పరిస్థితులకు అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. కంది, పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ, కొర్రలు తదితర పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలని, విత్తనాల కొనుగోలు అనంతరం బిల్లు భద్రపరచుకోవాలని సూచించారు. విత్తనాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.ప్రతి రైతు "విత్తన మేళా–2026"ను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ