తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గ్యాస్ కొరత ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఐడీఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పౌరసరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖలు, వివిధ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల యజమానులతో గ్యాస్ సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతోందన్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు వంటి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల అత్యవసర సేవల కోసం అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అందులో హెచ్‌పీసీఎల్ – 14, బీపీసీఎల్ – 05, ఐఓసీఎల్ – 07 గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. వాటిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు – 2,41,175, డబుల్ సిలిండర్ కనెక్షన్లు – 98,868, దీపం కనెక్షన్లు – 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు – 2,465, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కనెక్షన్లు – 73,162 ఉన్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధి అనంతరం మాత్రమే రీఫిల్ బుకింగ్‌కు అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ విషయంపై గ్యాస్ వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వస్తుందని, ఆ కోడ్‌ను గ్యాస్ డెలివరీ ప్రతినిధికి తెలిపిన తరువాతే గ్యాస్ సిలిండర్ అందజేయబడుతుందని తెలిపారు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గ్యాస్ సరఫరా ప్రక్రియ ప్రజలకు అంతరాయం లేకుండా కొనసాగేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రతి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.గ్యాస్ సిలెండర్ల రవాణా సమయం లో జాగ్రత్తలు పాటించాలని, రోజువారీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్‌ను కచ్చితంగా నిర్వహించాలని పేర్కొన్నారు. గ్యాస్ గోదాముల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. అధికారుల తనిఖీల సమయంలో ఎవరైనా అడ్డంకులు కలిగించినా లేదా దాడులకు ప్రయత్నించినా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గ్యాస్ సరఫరా సంబంధిత ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని, ప్రతి వినియోగదారునికి సమయానికి గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సిపిఓ సంజీవరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ