తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన సమస్యల పరిష్కారానికే రాష్ట్ర మహాసభలు 18న పాల్వంచలో జరిగే ప్రదర్శనకు భారీగా తరలిరావాలి: టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) మూడో రాష్ట్ర మహాసభల విజయవంతానికి ఏజెన్సీ పల్లెల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని బంగారు చెలక. బొజ్జలగూడెం, పాత బంగారుచెలక, పడగాయిగూడెం, లక్ష్మీపురం, చింతకుంట తదితర గిరిజన గ్రామాల్లో మంగళవారం సమాఖ్య నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి మహాసభల ప్రాధాన్యతను వివరించడంతో పాటు ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీల్లో పాల్వంచ పట్టణంలో జరగనున్న రాష్ట్ర మహాసభలు గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు, హక్కుల సాధనకు వేదిక కానున్నాయని స్పష్టం చేశారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ-గిరిజన సమాఖ్య జాతీయ నాయకులు డి అన్నిరాజా, పసుపతి కోల్, రాష్ట్ర నాయకులు అంజయ్య నాయక్, రామ్మూర్తి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఈ ఏజెన్సీ పోరాట మహాసభలను గిరిజనులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో వెంకట్, దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్, జర్పుల ఉపేందర్, కుంజా రాంబాబు, తాటి లక్ష్మణ్, పరుపర్తి రాజు, జోగా రామయ్య, ఇమామహేశ్వరి, బదియా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ