తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, భూసేకరణ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయం క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న భూసేకరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించి సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, రోజుకు 15 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్వే బృందం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలని, రైతులకు సంబంధించిన అంశం కావడంతో వారు పొలాల వద్ద అందుబాటులో ఉండే సమయంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే, మరుసటి రోజు ఏ గ్రామంలో సర్వే నిర్వహించనున్నారో ముందుగానే నోటీసుల ద్వారా రైతులకు తెలియజేయాలని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న సమయంలోనే సర్వే పూర్తి చేయడం ద్వారా భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడం సాధ్యమవుతుందని అన్నారు . భూసేకరణకు సంబంధించిన పురోగతి వివరాలను ప్రతిరోజూ నివేదికల రూపంలో అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించిందని, రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయంతో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. భూ సర్వే నిర్వహణ కోసం ఏడు ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, సుమారు 3,000 ఎకరాల భూమి సర్వేను రెండు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి బృందం ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ముందస్తు సమాచారం అందించి వారి సహకారంతో సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని భూసేకరణ సర్వేను నిర్ణీత గడువులో పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవీంద్రనాథ్, వెంకట్రావు,రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, భూసేకరణ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ