తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించి పదవ తరగతి విద్యార్థులపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం నాడు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండా గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల లోని పరిసరాలు మరియు వంటగది, సామాన్లు నిలువ చేసే స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్ పరిశీలించి నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారము సమయానుకూలంగా ఆహార పదార్థాలు అందిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మెనూ ప్రకారం మంచి పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నందున విద్యార్థులు చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని అన్నారు. చలికాలం నడుస్తున్నందున పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని రాత్రిపూట విద్యార్థులు ఎవరు బయటకు రాకూడదని, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరించవచ్చని అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎంకు ఆదేశించారు.ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యరీత్యా ప్రత్యేక వైద్య పరీక్షలు చేయడానికి ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాలలో పనిచేసే ఏఎన్ఎం లకు సరఫరా చేసిన మెడికల్ కిట్లను పరిశీలించి విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే వెంటనే వైద్య చికిత్సలు అందించాలని ఏఎన్ఎం కు సూచించారు. వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని, వంట చేసిన తర్వాత విద్యార్థులకు సరఫరా చేసేముందు వార్డెన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు మరియు పనిచేసే సిబ్బంది తిన్న తర్వాతనే వారికి వడ్డించాలని అన్నారు.విద్యార్థులు హెచ్ఎంకు చెప్పకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లకూడదని, ఖాళీ సమయాలలో కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన చార్టులు పరిశీలించి భవిష్యత్తులో మీరు ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఇప్పటినుంచే ప్రిపేర్ కావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా సబ్జెక్టులలో వెనుక పడ్డ పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్, వార్డెన్ కిషన్ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ