తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులుకు నిధులు కేటాయించండి. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనలు నిధులు విడుదల చేయండి. ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. కార్పొరేషన్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సందర్భంగా మేయర్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నగరవ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యుజిడి) వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో పెరిగిన రవాణా అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణతో పాటు రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనుల ద్వారానే నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. కార్పొరేషన్ ఆరంభ దశలో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మేయర్ అందించిన వినతిపత్రంపై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, పనుల నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. మేయర్ వెంట సిపిఐ నాయకులు కార్పొరేటర్లు ఎండియూసు బోయిన విజయకుమార్, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ