తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం–పాల్వంచ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 14 కోట్లతో దమ్మపేట–పాల్వంచ నాలుగు లేన్ల రహదారి విస్తరణకు శంకుస్థాపన. 50 లక్షలతో సీసీ రోడ్ పనులు , 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్–డివైడర్ అభివృద్ధి పనులకు శ్రీకారం. పాల్వంచలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం... జీవో–76 అంశంపై త్వరలో స్పష్టత.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారిలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధుల ద్వారా రూ.14 కోట్ల నిర్మాణ వ్యయంతో సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించే పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మంచికంటి నగర్ హర్ష టౌన్‌షిప్‌లోని ఎస్‌కేటీ అపార్ట్‌మెంట్ నుంచి ప్రధాన రహదారి వరకు రూ.50 లక్షల నిర్మాణ వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అలాగే కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి గోదుమవాగు వరకు రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల సంక్షేమ కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తూనే, మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. అదే క్రమంలో కొత్తగూడెం–పాల్వంచ ప్రాంతంలో రహదారులు, పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దమ్మపేట–పాల్వంచ రహదారి గత అనేక సంవత్సరాలుగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, పాల్వంచతో పాటు అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ రహదారిపై ఆధారపడుతున్నందున అత్యవసరంగా డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.14 కోట్లను మంజూరు చేసి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచ ప్రాంతంలో భూ సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే కొన్ని సర్వేలు పూర్తయ్యాయని, మిగిలిన సర్వేలను కూడా వేగవంతంగా పూర్తి చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. సింగరేణి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన జీవో–76 అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలన జరుపుతోందని, త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.పాల్వంచ పారిశ్రామిక ప్రాధాన్యతను మరింత పెంచేందుకు కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కొత్తగూడెం పరిసర ప్రాంతంలో విమానాశయం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు.జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు, మెట్ట పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని, రైతులకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌కు అదనంగా మరో లక్ష ఇళ్లను మంజూరు చేసి మొత్తం సుమారు 8 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇప్పటికే లక్షన్నర ఇళ్లు పూర్తయ్యాయని, మరో రెండు లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అన్నారు .విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ గురుకుల, ఆశ్రమ విద్యాసంస్థల్లో డైట్ ఛార్జీలను పెంచడంతో పాటు రాష్ట్రంలో పారదర్శకంగా సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు ఇప్పుడు వేగంగా అమలవుతున్నాయని అన్నారు. కొత్తగూడెం–పాల్వంచ బైపాస్ రహదారి నిర్మాణం, యూనివర్సిటీ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు, పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, మెడికల్ కాలేజీ, ఎస్పీ కార్యాలయం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరును *"కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్"*గా మార్చే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక తదితర శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టినట్లు మంత్రికి వివరించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, మెట్ట పంటల సాగు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, స్థానిక సంస్థలకు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్టీవో మధు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ