తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం క్షమించరానిది.రేవంత్ రెడ్డి చేతకాని పాలన వల్లే ప్రభుత్వ వైద్యం నిర్వీర్యం.మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ధ్వజం. బిఆర్ఎస్ నాయకులతో కలిసి గర్భిణీని పరామర్శ.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా.కొత్తగూడెం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో నిండు గర్భిణీ నిలబడి డెలివరీ అయిన సంఘటన అత్యంత బాధాకరమని, మనసును తీవ్రంగా చలింపజేసిందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. గురువారం నాడు భారాస ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత గర్భిణీని పరామర్శించి, శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట నుండి పేద మహిళలు నమ్ముకుని ఇక్కడికి వస్తే, కనీసం స్పందించే నాథుడే కరువయ్యారు. నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా, ఒక ఇంజెక్షన్ ఇచ్చి 6 గంటల తర్వాత డెలివరీ అవుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. క్షణాల వ్యవధిలో ప్రసవమయ్యే అవకాశం ఉంటుందని తెలిసి కూడా మహిళా రోగుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? దేవుడి దయ వల్ల, ఆ తల్లిదండ్రుల పుణ్యం వల్ల పాప ప్రాణాలతో బయటపడింది కానీ, ఏ మాత్రం తేడా జరిగినా ఆ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులెవరు? గత భారాస ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. నిరంతరం రివ్యూలు చేస్తూ, మందుల కొరత లేకుండా చూశారు. కరోనా వంటి విపత్కర సమయంలోనూ అద్భుత సేవలు అందించారు. కానీ నేడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి చేతకాని పాలన వల్ల ఆసుపత్రుల్లో కనీసం మందులు లేవు, స్కానింగ్ డాక్టర్లు అందుబాటులో లేరు, డయాలసిస్ రోగులు అల్లాడిపోతున్నారు. తాము భారాస కండువాలతో ఆసుపత్రికి వెళ్లగానే, అక్కడి మహిళలందరూ తమ చుట్టూ చేరి గతంలో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు లేవని, మందులు కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను సైతం ఈ ప్రభుత్వం పాడుబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.కలెక్టర్ వెంటనే రివ్యూ చేయాలి: జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులు నిరంతరం రివ్యూలు నిర్వహించి, పేద ప్రజలకు సక్రమంగా వైద్యం అందేలా చూడాలి. లేనిపక్షంలో భారాస తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో భారాస ప్రభుత్వం రావడం ఖాయం, అప్పుడే పేద ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. "జై తెలంగాణ.. జై కేసీఆర్" అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో భారాస ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ