తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీసేవ ద్వారా అందిస్తున్న వివిధ ధృవపత్రాల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ విధానాలపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అవగాహన కల్పించారు. చండ్రుగొండ తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్ స్వర్ణ ఆధ్వర్యంలో ఆయా మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులతో సమావేశం నిర్వహించి మీసేవ దరఖాస్తుల పరిశీలన, ధృవపత్రాల జారీ ప్రక్రియపై సమీక్షించారు.ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు అప్లోడ్ చేసిన పత్రాలను మాత్రమే జీపీఓలు, ఆర్‌ఐలు పరిశీలించి అర్హత మేరకు ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలను స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన GPOs & MRIs Verification Mobile Application వినియోగంపై అధికారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించవచ్చని వివరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేయరాదని తెలిపారు. దరఖాస్తుల నమోదు సమయంలో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, డేటా ఎంట్రీలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ధృవపత్రాల జారీ అనంతరం సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు.మీసేవ సేవలకు సంబంధించిన సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైనప్పుడు మండల స్థాయి జీపీఓ, ఆర్‌ఐ లేదా తహసీల్దార్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ