తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు జిఆర్ఎం, ఎంఆర్ఎం సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (జిఆర్ఎం), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్ఎం)ల వినియోగం, అమలు విధానం, ప్రజ ప్రయోజనాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ నేరాల్లో ప్రమేయం లేకపోయినా దర్యాప్తు ప్రక్రియలో బ్యాంకు ఖాతాలు లేదా నగదు ఫ్రీజ్ అయిన పౌరులు జిఆర్ఎం ద్వారా తమ వినతులను సంబంధిత బ్యాంకులకు సమర్పించుకోవచ్చని, సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయడం లేదా ఫ్రీజ్ అయిన నగదును విడుదల చేసే చర్యలు చేపడతారని వివరించారు.అలాగే సైబర్ మోసాలకు గురైన బాధితులకు కోల్పోయిన నగదును త్వరితగతిన పునరుద్ధరించేందుకు ఎంఆర్ఎం మాడ్యూల్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రూ.50,000 లోపు అర్హత కలిగిన ఫ్రీజ్ అయిన మొత్తాన్ని కోర్టు ఉత్తర్వులు లేకుండానే, నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం బాధితులకు తిరిగి అందించే అవకాశం ఈ విధానంలో ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్ జిఆర్ఎం, ఎంఆర్ఎం మాడ్యూళ్లను సమర్థవంతంగా వినియోగించి ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకులు, దర్యాప్తు అధికారులతో సమన్వయం పెంచి సైబర్ నేరాల బాధితులకు వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.శిక్షణ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, పోలీసు అధికారులు, సైబర్ వారియర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ